నిత్యం వేలాది మంది ప్రయాణికులను భారత్ రైల్వే వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రయాణికులకు వసతితో పాటు రక్షణతో కూడిన ప్రయాణాన్ని రైల్వేస్ అందిస్తోంది. ప్రయాణ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రయాణికులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.
ప్రయాణికుల భద్రత కోసం `ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ` అనే పేరుతో ఐఆర్సీటీసీ ద్వారా ఇండియన్ రైల్వేస్ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. బీమా పాలసీలో భాగంగా కేవలం 35 పైసలకే రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రయాణికులకు అందిస్తోంది.
ఈ బీమా సౌకర్యం దేశంలోని ఏ రైలులో ప్రయాణించేవారికైనా వర్తిస్తుంది. అయితే ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఐదేండ్ల లోపు చిన్నారులు, విదేశీయులకు మాత్రం ఈ బీమా సౌకర్యం వర్తించదు.
టికెట్‌ను బుక్ చేసుకునే సమయంలో ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. అలా చేసుకుంటే టికెట్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాగానే సంబంధిత ప్రయాణికుడి మొబైల్‌కు, ఈ-మెయిల్‌కు మెసేజ్ వస్తుంది. దీంతో పాటు నామినీ వివరాలను పొందుపరిచేందుకు ఓ లింక్ ను కూడా రైల్వే పంపుతుంది.
ఇందులో క్యాన్సిలేషన్‌కు ఎలాంటి అవకాశం ఉండదు. పీఎన్ఆర్ కింద బుక్ చేసుకున్న టికెట్ బుకింగ్స్‌కు బీమా వర్తిస్తుంది. ఇది కేవలం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారికే మాత్రమే వర్తిస్తుంది. కౌంటర్ వద్ద టికెట్ తీసుకున్న వారికి వర్తించదు.
బీమా సౌకర్యం తీసుకున్న తర్వాత ప్రయాణ సమయంలో ప్రయాణికుడు మరణించినా, శాశ్వత అంగ వైకల్యం కలిగినా రూ. 10 లక్షల బీమా లభిస్తుంది. ఒక వేళ పాక్షికంగా అంగ వైకల్యం కలిగితే రూ. 7.50 లక్షలు, గాయల పాలైతే ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు.
ప్రమాద సమయంలో మరణించిన ప్రయాణికుడి మృతదేహాన్ని తరలించేందుకు గాను రూ. 10 వేలు చెల్లిస్తారు. పట్టాలు తప్పినా, ఉగ్రదాడులు, దోపిడీ, అల్లర్లు, ప్రమాదవశాత్తు ప్రయాణికుడు రైలు నుంచి పడిపోయినా, రైళ్లు ఢీకొన్నా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. అయితే టికెట్ బుకింగ్‌కు ముందు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ నియమ, నిబంధనలు నిశితంగా, క్షుణ్ణంగా పరిశీలించాలని రైల్వే చెబుతోంది.