వేసవిలో వేడికి అడవుల్లో మంటలు చెలరేగడం సాధారణం. మంటలతో తీవ్రమైన నష్టాలు వాటిల్లిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. తన పరిమితుల్లోని అడవుల్లో మంటలు చెలరేగితే.. వాటిని నియంత్రించడానికి ఈ ఏడాది స్థానిక చెంచుల సేవలను ఉపయోగించుకోనుంది. ముందుగా ఫైర్ లైన్ల నిర్వహణ.. ఇతర అంశాలపై స్థానిక చెంచులకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. దీని కోసం ఏటీఆర్ ఫారెస్ట్ లోని సంబంధిత గ్రామాలలో పని చేయడానికి ఈ సీజన్ లో చెంచులను తాత్కాలికంగా నియమిస్తోంది. జనవరిలో కొన్ని అటవీ అగ్ని ప్రమాదాలు నమోదవుతాయి. విశేషమేమిటంటే ఈ సంవత్సరం ఏటీఆర్ నుండి ఇప్పటివరకు ఒక్క ఘటన కూడా వెలుగుచూడకపోవడం గమనార్హం.
ఈ రిజర్వ్ లో దాదాపు 600 కి.మీ మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. అడవి మంటల నివారణ, నియంత్రణలో చెంచుల సంప్రదాయ పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకుంటున్నారని ఏటీఆర్ సీనియర్ అధికారి తెలిపారు. ఒక్కో గ్రామంలో దాదాపు 45 నుంచి 50 మంది చెంచులను అగ్నిమాపక సిబ్బందిగా నియమించారు అధికారులు. వారు ఫైర్ లైన్లను పర్యవేక్షించడంతోపాటు.. అక్కడి పరిస్థితులను బేస్ క్యాంపు అధికారులకు నివేదిస్తారు.
ఈ చర్య రెండు విధాలుగా పనిచేస్తోంది. స్థానిక చెంచులు సీజన్ లో మంచి ఆదాయాన్ని పొందుతున్నందున, అటవీ శాఖ అగ్నిమాపక హద్దులను సమర్థవంతంగా పర్యవేక్షించి, ఏదైనా ఘటన జరిగితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలతో పాటు ఏటీఆర్ ఫైర్ బ్లోయర్లను కొనుగోలు చేసి చెంచులకు అందజేస్తోంది. పరికరాలను ఆపరేట్ చేయడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి వారికి శిక్షణ ఇస్తున్నారు అధికారులు.
Advertisements
సకాలంలో జోక్యం చేసుకోవడం, మంటలను నియంత్రించడంలో సమర్థవంతమైన మార్గాన్ని నిర్ధారించడమే లక్ష్యం. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగితే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామంలోని ముఖ్యమైన ప్రాంతాన్ని చెంచులు పర్యవేక్షిస్తారు. కాబట్టి.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయగలరని అధికారి తెలిపారు.