కశ్మీరి పండిట్ టీచర్ల బదిలీ జాబితా లీక్ కావడంతో కేంద్రంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కశ్మీర్ లో మైనారిటీల జీవితాలను కేంద్రం పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వారిని జమ్మూ ప్రాంతానికి బదిలీ చేయడాన్ని నిరాకరించడం, బదిలీ జాబితాను సోషల్ మీడియాలో లీక్ చేయడం ద్వారా కశ్మీరి పండిట్ల జీవితాలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తోందని ఆమె విమర్శించారు.
టీచర్ల బదిలీ జాబితా లీక్ కావడంపై ట్విట్టర్ లో ఆమె స్పందిస్తూ… ‘ఇది చాలా అవమానకరం. స్పష్టంగా ఇది కశ్మీరి పండిట్ల జీవితాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే’ అని ట్వీట్ చేశారు.
ఇకపై మీ మాటలను కశ్మీరి పండిట్లు ఎందుకు నమ్మాలి అని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. బదిలీ జాబితాల లీక్ పై బీజేపీ ప్రతినిధి స్పందించారు. ఇది అతిపెద్ద భద్రతా ఉల్లంఘన అన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.