జైల్లో వున్న ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. షెల్ కంపెనీల ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రూ.80 కోట్ల నిధులు మళ్లించినట్లు తెలిపాడు. ఢిల్లీ సీఎం నివాసంలో ఫర్నీచర్ ఖర్చులను కూడా తానే భరించానని వెల్లడించాడు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను త్వరలోనే బయట పెడతానని తెలిపాడు.
జైల్లో వున్న సుఖేశ్ తన అడ్వకేట్ ద్వారా ఈ లేఖను విడుదల చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆ నిధులను మారిషస్ కు మళ్లించినట్టు పేర్కొన్నాడు సుఖేశ్. అక్కడ ‘గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్’అనే కంపెనీకి ఈ నిధులను మళ్లించారని ఆరోపించాడు.
మొత్తం మూడు విడతల్లో రూ.25 కోట్లు, రూ.25 కోట్లు, రూ.30 కోట్ల చొప్పున బదిలీ చేసి ఆ తర్వాత దాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చారని చెప్పాడు. వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే బయట పెడతానన్నాడు. ఇక సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఫర్నీచర్ కు సంబంధించిన బిల్లుల వివరాలను గత నెలలోనే విడుదల చేశాడు సుఖేశ్.
ఈ వివరాలను వెల్లడించినందుకు జైల్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు. ఈ విషయంపై తాను జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.