హైదరాబాద్ సమీపంలో గుప్తనిధుల వేట సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో గుప్త నిధుల కలకలం రేపుతున్నాయి. బుద్వేల్ అంజనేయ స్వామి దేవాలయం సమీపంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా తొమ్మిది మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి మూడు కార్లు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిమీద కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దీనికి సంబంధించి మరింత వివరాల్లోకి వెళ్తే.. గత రెండేళ్లుగా బుద్వేల్ లో ఇందిరా, మహేశ్ అనే దంపతుల ఇల్లు ఖాళీగా ఉంటోంది. వీరి రెండో అల్లుడు వినోద్. ఆ ఇంట్లో గుప్త నిధులు ఉంటాయని అనుమానించాడు. దీంతో వారింట్లో తవ్వకాలు చేపట్టాడు. అయితే, తాను చేసే పని బైటికి పొక్కకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని.. ఇంట్లో టెంట్ లు వేయించి.. ఫంక్షన్ చేస్తున్నట్లు నమ్మించాలని చూశాడు.
వినోద్ తరచుగా బాబాల దగ్గరికి వెడుతుంటాడని తెలిసింది. ఇందిరా, మహేశ్ ల ఇంట్లో పురాతన కాలం నాటి గోడ ఉంది. ఈ విషయం బాబాకు చెప్పడంతో గుప్త నిధులు ఉండొచ్చని తెలిపాడని.. దీంతో ఆశతో తవ్వకాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ శబ్దాలకు ఇరుగుపొరుగు వారు భయబ్రాంతులకు గురయ్యారు.
ఏదో జరుగుతుందన్న అనుమానంతో ఆరా తీశారు. అప్పుడు వారికి వినోద్ తమ అత్తామామల ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని ఎస్ వోటీ అధికారులకు తెలిపారు. ఆ సమాచారం మేరకు దాడులు చేసిన ఎస్ఓటీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.