ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో సాహితీ ఇన్ ఫ్రా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. సాహితి ఇన్ ఫ్రా పై బాధితులు విడివిడిగా ఇచ్చిన ఫిర్యాదుల పై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది.
అయితే అన్ని పిటిషన్లను ఓకే కేసుగా పరిగణించాలని సాహితి ఇన్ ఫ్రా డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని ఆ సంస్థ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సాహితి ఇన్ ఫ్రా పై సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో 42 కేసులు నమోదయ్యాయి. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.
ఇక ప్రీ లాంచ్ పేరుతో 1500 కోట్ల రూపాయలు దోచుకుని జనాల చెవిలో పెద్ద క్యాలీఫ్లవర్ పెట్టేశారు సాహితీ ఎండీ నారాయణ. ఇదిగో సెటిల్మెంట్.. అదిగో ఇచ్చేస్తున్నా అంటూ ఉదరగొట్టిన మాటలన్నీ నీటి మూటలయ్యాయి. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితిలో పైగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. అయితే కేసులు పెడితే న్యాయం జరగదంటూ నారాయణ బెదిరించాడు. అంతేకాదు దీన్ని సివిల్ కేసులా చూడాలని పోలీస్ బాస్ లతో పైరవీలు చేశాడు. దీంతో కొందరు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా తీసుకోలేదు. ఇంతలా మోసం చేసినా.. పట్టించుకునే నాథుడే లేడని 3 వేల మంది బాధితులు కన్నీరుమున్నీరై న్యాయ కోసం పోరాటానికి దిగారు. పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేశారు.
చివరికి పోలీసులు మహా మోసగాడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. దీంతో ఈ కేసు విచారణ హైకోర్టులో నడుస్తోంది. అయితే విడివిడిగా కాకుండా.. అన్ని ఫిర్యాదులను కలిపి ఒకే కేసుగా నమోదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.