మహరాష్ట్రలో ముఖ్యంగా ముంబాయి పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 50వేలకు చేరువలో ఉంటే ఒక్క ముంబాయి పట్టణంలోనే 10వేల కేసులు దాటిపోయాయి. మహరాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య 15వేలు దాటడం పరిస్థితికి అద్దం పడుతోంది.
దీంతో ముంబాయిలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మహ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబాయిలో ఉన్న ప్రైవేటు సంస్థల్లో పనిచేసే డాక్టర్లంతా వెంటనే దగ్గర్లోని కోవిడ్ ఆసుపత్రుల్లో రిపోర్ట్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 15 రోజుల పాటు మీకు అనువైన చోట విధులు నిర్వహించాలని… తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అత్యవసర సమయాన మీ సేవలు కావాలని ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను పట్టించుకోకుండా… ప్రభుత్వ సర్వీసుల్లో జాయిన్ కాని వారి మెడికల్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ 15రోజుల పాటు మీ సేవలకు ప్రభుత్వం గౌరవవేతనాన్ని కూడా చెల్లిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
అయితే… ఎదైనా అరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారు, 55 సంవత్సరాలకు పైబడిన డాక్టర్లకు ఈ నోటిఫికేషన్ నుండి ప్రభుత్వం మినహాయించింది.