యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కి బెదిరింపులకు పాల్పడుతూ పేలుడు పదార్థాలను గుర్తు తెలియని వ్యక్తులు పంపించారు. అయితే.. ఈ పేలుడు పదార్థాలు మధ్యప్రదేశ్ లో బయటపడ్డాయి. సీఎం యోగీని బెదిరిస్తూ రేవా పట్టణంలో ఓ లేఖతో పాటు టైమరుతో కూడిన పేలుడు పదార్థాలు కనిపించాయి. వాటిని స్థానిక పోలీసులు నిర్వీర్యం చేశారు.
జాతీయ రహదారి-30పై వంతెన కింద బెదిరింపు లేఖతో పేలుడు పరికరాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని దాన్ని నిర్వీర్యం చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖ, పేలుడు పదార్థాలు ఎవరు పెట్టారు. అసలు.. యోగీని బెదిరించడానికి మధ్యప్రదేశ్ లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు ప్రారంభం అయింది.
కాగా.. గణతంత్ర దినోత్సవం రోజున భారీ ఎత్తున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేశారని ఇంటెలిజెన్సీ వర్గాలు ఇటీవల తెలిపాయి. భారత్ లో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాది జరగనున్న గణతంత్ర వేడుకలను ముష్కరులు టార్గెట్ గా పెట్టుకున్నారని నిఘా సంస్థలు హెచ్చరించాయి.
సరిగ్గా అదే రోజున బెదిరింపు లేఖ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ యూపీ సీఎంకి ఉగ్రవాద ముప్పు భయాన్ని పెంచుతోంది. దీంతో యూపీలో సీఎం యోగికి భద్రతను పెంచారు.