ఏవోబీలో గిరిజనుల సమస్యలు గురించి చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. కటాఫ్ ఏరియాలో గురుప్రియ వంతెన నిర్మాణం జరిగిన తర్వాత పరిసర ప్రాంత పంచాయతీలు అభివృద్దిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టిసారించడం లేదని ఆరోపిస్తూ.. ఏడు పంచాయతీలకు చెందిన గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ఏవోబీ కటాఫ్ ఏరియాలోని బొడపొదర్, నవగూడాచ దొరగూడ, గుంటవాడ, పప్పులూరు, కుర్మనూరు పంచాయతీలకు చెందిన వందలాది మంది గిరిజనులు నిరసనలు చేపట్టారు. నిరసనల్లో భాగంగా సభాస్థలి నుంచి ర్యాలీగా చిత్రకొండ పోలీసు స్టేషన్ కి వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సాంప్రదాయ ఆయుధాలతో దాడికి దిగారు.
కత్తులు, గొడ్డళ్లు, బాణాలతో స్టేషన్ గేట్లు బద్దలుగొట్టి స్టేషన్ పరిసరాల్లోకి ప్రవేశించారు. ద్విచక్రవాహనాలు, ఫర్నిచర్, సామాగ్రీ, భవనాలు ద్వంసం చేశారు. గత వారం రోజుల నుంచి పలు గ్రామాల్లో గంజాయ నిల్వలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈ సమయంలో జరిగిన గొడవే దీనికి కారణమని భావిస్తున్నారు పోలీసులు.
ఈ దాడి సమయంలో పోలీసులకు, గిరిజనులు మద్య కాసేపు పెనుగులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కొంతమంది గిరిజనులు గాయపడ్డారు. అంతేకాకుండా.. ద్విచక్రవాహనాలు ద్వంసం అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్టేషన్ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.