మెడికో ప్రీతి మరణంతో వరంగల్ కేఎంసీ, ఎంజీఎం దగ్గర భారీ భద్రతను ఉంచారు. ప్రీతి మృతితో అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అడుగడుగునా పోలీసులను మోహరించారు.
ఇటు ప్రీతి సొంతూరు మొండ్రాయిలో ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై గిరిజన సంఘాల నేతలు బైఠాయించారు. కేఎంసీ హెచ్ఓడీపై చర్యలకు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నాకు కూర్చున్నారు.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులు సంతకం చేస్తేనే బాడీని షిఫ్ట్ చేయడానికి వీలు ఉంటుంది. దీంతో ప్రీతి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.
ఇటు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, డాక్టర్ల అసోసియేషన్ సభ్యులు కూడా ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. అలాగే, కేఎంసీ హెచ్ఓడీని నిందితుడిగా చేర్చాలన్నారు.