గిరిజన సంఘాల నేతలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సేవాలాల్ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వెంటనే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అక్కడ ఉన్న పోలీసులు గిరిజన నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గిరిజన సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. క్యాంపు కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు కొద్ది మంది నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు.
మరోవైపు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళా నేత సునీతా రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోయిందని ఆమె అన్నారు. మైనర్లపై అత్యాచారాలు జరుగుతుంటే అర్థరాత్రి వరకు మద్యం షాపులకు అనుమతి ఇస్తారా అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాదక ద్రవ్యాలు ఎక్కడ అమ్ముతున్నారో తమకు సమాచారం ఉందన్నారు.
వాటి మీద దాడులు చేసి అడ్డుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31న బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి గాంధీభవన్ నుంచి మహిళా నేతలు బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.