మెరుగైన వైద్యం అనే మాట వారికి తెలియదు. వైద్యం అందితే చాలు అనుకుంటారు.ఎందుకంటే అది ఆకు పసరుతో ఆగే వ్యాధి కాదు. వైద్యోనారాయణా అంటూ జోలి పట్టాల్సిందే..డోలి కట్టాల్సిందే.
దేవుడి మీదభారం వేస్తూ పేషెంటు భారం మోస్తూ కొండలు, గుట్టలు, లోయలు దాటుకుంటూ భుజం తర్వాత భుజం మారుస్తూ తమ సాటి ప్రాణాన్ని కాపాడాలని ఎన్ని దేవుళ్ళకి మొక్కుతారో వారికే తెలియదు.! రోడ్డు కనబడితే చాలు ఇప్పటి దాకా పడ్డశ్రమంతా మర్చిపోతారు. ఇది గిరిపుత్రుల నిరంతర నిర్వేదం.
అయితే గిరిజనుల బాధను కూడా తమ బాధ్యతగా స్వీకరించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆశా వర్కర్, ఏ.ఎన్.ఎమ్ లు. ఇద్దరూ డోలి కట్టి గిరిజన మహిళ నివాసముంటున్న గిరిశిఖర ప్రాంతం నుంచి క్రిందకు మోసుకు వచ్చారు. ఎస్.కోటకు వెళ్లేందుకు ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె ప్రాణాన్ని రక్షించడాన్ని తమ భుజాలకెత్తుకున్నారు.
గిరిజన సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. గిరిపుత్రుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అంటున్నాయి. కానీ, వాస్తవ గిరిజనుల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
క్షేత్ర స్థాయిలో గిరిజనుల గోడు వినే నాధుడే లేకుండా పోయారు. అడుగడుగున సౌకర్యాలతో, ఇబ్బందులతో పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే నాయకులు లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక గర్భిణీల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.విజయనగరం జిల్లాలో డోలి కష్టాలు కొనసాగుతున్నాయి.. ఎస్ కోట మండలం గుడిలోవ గిరిశిఖర ప్రాంతంలో నివసిస్తున్న జన్ని మంగ అనే గిరిజన మహిళకు నెలలు నిండక ముందే పురిటి నొప్పులు మొదలయ్యాయి.
ఆ రోజు తెల్లవారుజామున మగ బిడ్డను ప్రసవించింది. అయితే, కడుపునొప్పితో భాధ పడుతుండటంతో ఆ గిరిజన మహిళ భర్త ఎస్.కోటలో ఉన్న ఏ ఎన్ ఎమ్ లకు సమాచారం అందించారు.
హుటా హుటిన ఆ గ్రామ ఏ ఎన్ ఎమ్ చదరం పార్వతీదేవి, ఆశా వర్కరు లక్ష్మి ఇద్దరు ఆ గిరిజన మహిళ వద్దకు చేరుకొని ప్రాథమిక వైద్యం అందించారు. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు. అయితే, మరింత మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యారు..అయితే ఎస్ కోట కు వెళ్లేందుకు ఎటువంటి రహదారి సౌకర్యం లేదు.
ఆశా వర్కర్ ఏ.ఎన్. ఎమ్ లు ఇద్దరూ డోలి కట్టి గిరిజన మహిళ నివాసముంటున్న గిరిశిఖర ప్రాంతం నుంచి క్రిందకు మోసుకు వచ్చారు. మహా శివరాత్రి కావడం ఆ గ్రామంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఇద్దరే కష్టపడి డోలి మోయాల్సి వచ్చింది.