– చినజీయర్ పై ఆదివాసీల ఆగ్రహం
– రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మ దహనాలు
– పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
– నగర బహిష్కరణ చేయాలని డిమాండ్లు
సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపాయి. గిరిజనులు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మరోసారి చినజీయర్ పై ఫైరయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన దేవతలపై ఎందుకంత అక్కసు అని మండిపడ్డారు.
చినజీయర్ స్వామికి చినజీయర్ ‘భూ’స్వామిగా నామకరణం చేస్తున్నట్లు దళిత శక్తి ప్రోగ్రాం పేర్కొంది. సమ్మక్క, సారలమ్మ అగ్రకుల కాకతీయ సామ్రాజ్యంపై యుద్ధం చేసిన మహారాణులని తెలిపింది. అందుకే ఆదివాసీలు, అణగారిన ప్రజలంతా తమ విముక్తి కోసం పోరాడిన ఆ వీర వనితలను తమ దేవతలుగా ఆరాధించడం మొదలుపెట్టారని చెప్పింది. అలాంటి వారిని అవమానపరుస్తూ అగ్రకుల అహంకారిగా విషం కక్కుతున్న చినజీయర్ ‘భూ’స్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది డీఎస్పీ. గతంలో కూడా చాలా సందర్భాల్లో అణగారిన వర్గాలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ ‘భూ’స్వామిపై పోలీసులు వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
ఇక ఉస్మానియా యూనివర్సిటీలో చినజీయర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు గిరిజన విద్యార్థులు. సమ్మక్క సారలమ్మను అవమానించడం.. గిరిజన జాతి మొత్తాన్ని అవమానించడమేనన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం మద్దతు తెలిపితే.. గిరిజనులు ఎవరూ టీఆర్‌ఎస్ ను పట్టించుకోరని హెచ్చరించారు. చినజీయర్ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు గిరిజన విద్యార్థులు.
చినజీయర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించింది సీపీఎం గిరిజన సంఘం. చిక్కడపల్లి పీఎస్ కు వెళ్లిన నేతలు చినజీయర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. చినజీయర్ అహంకారపూరితంగా మాట్లాడారని అన్నారు సీపీఎం గిరిజన నేతలు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చినజీయర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘం డిమాండ్ చేసింది. సమ్మక్క సారలమ్మపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బస్టాండ్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించి.. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నాయకులు.