టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు సాకేత్ గోఖలేకు గుజరాత్ పోలీసులు షాక్ ఇచ్చారు. జైపూర్ విమానాశ్రయంలో ఆయన్ని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన సోమవారం న్యూఢిల్లీ నుంచి జైపూర్ బయలు దేరారని పోలీసులకు సమాచారం అందింది.
ఈ క్రమంలో ఆయన్ని జైపూర్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ వెల్లడించారు. అరెస్టు తర్వాత గోఖలే తన తల్లికి మంగళవారం ఫోన్ చేశారని ఓబ్రెయిన్ పేర్కొన్నారు. గుజరాత్ పోలీసులు తనను అహ్మదాబాద్‌కు తీసుకువెళ్తున్నట్టు గోఖలే తన తల్లికి చెప్పాడన్నారు.
మోర్బీ సమీపంలో ఇటీవల కేబుల్ వంతెన కూలిపోయింది. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ఈ క్రమంలో మోర్బీలో ప్రధాని పర్యటించిన కొద్ది గంటలకే రూ. 30 కోట్లు ఖర్చయిందని గోఖలే ట్వీట్ చేశారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీలకు మొత్తం రూ.5.5కోట్లు ఖర్చు చేశారని, 135 మంది ప్రాణాల కంటే ఎక్కువ ఖర్చయ్యిందని ఆయన విమర్శించారు.
ఘటనలో చనిపోయిన 135 మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందని ఆరోపించారు. దీనిపై బీజేపీ మండిపడింది. గోఖలే తన ట్వీట్‌లో ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆర్టీఐ కింద అలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది.