మగబిడ్డకు జన్మనివ్వలేదన్న కారణంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదలించుకోవాలనుకున్నాడో ఓ వ్యక్తి. తలాక్ చెప్పటమే కాదు… వెంటనే మరో పెళ్లి కూడా చేసుకున్నాడని ఆరోపిస్తుంది ఆ మహిళ.
మెహ్రన్ బేగం అనే మహిళ తన భర్త దస్తగిరితో హైదరాబాద్‌లో ఉంటుంది. ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనివ్వటంతో… మగబిడ్డ పుడుతుందని ఆశపడ్డ దస్తగిరి మెహ్రన్‌కు తలాక్ చెప్పేశాడు. దీంతో తనను వదిలించుకోవడానికే ఇలా చేస్తున్నాడని, ఇప్పటికే మరో పెళ్లి కూడా చేసుకున్నాడని ఆ మహిళ చార్మినార్ మహిళా పోలీసులను ఆశ్రయించింది.
2011లో వివాహం అయిందని, పెళ్లైన ఏడాదికే గర్భం దాల్చగా… ఆడిపిల్ల అని తెలియటంతో పసరు పోసి అబార్షన్ చేయించారని పోలీసులకు తెలిపింది. పైగా గతంలోనే అడిగినంత కట్నం ఇచ్చినా… మళ్లీ వేధింపులకు గురి చేస్తూ తనను వదిలించుకునేందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది మెహ్రన్ బేగం. తనకు వారసుడిని ఇవ్వనందుకే తలాక్ చెప్తున్నట్లు మా పుట్టింటి వారి ముందే ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు పోలీసులతో వాపోయింది.
ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చాక కూడా ఇలాంటి ఘోరాలు ఆగటం లేదని… మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మెహ్రన్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.