త్రిపురలో 60 సీట్లున్న అసెంబ్లీకి పోలింగ్ గురువారం మొత్తం మీద ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 32 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు జరిగాయని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని సౌత్ త్రిపుర పోలీసులు తెలిపారు. ఈ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. సీపీఎం,కాంగ్రెస్ కూటమి, బీజెపీ, తిప్రా మోథా అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలవరకు కొనసాగనుంది. బీజేపీ తరఫున కొందరు దుండగులు ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ప్రజలను ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని విపక్ష నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. గోమతి జిల్లాతో బాటు సౌత్ త్రిపురలోను, మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్టు తెలుస్తోందన్నారు. ఇక అధికార పార్టీ నేతలు ధన్ పూర్, మోహన్ పూర్ వంటి చోట్ల హింసకు పాల్పడుతున్నట్టు తమకు సమాచారమందిందని తిప్రా మోథా చీఫ్ ప్రద్యోత్ దేబ్ వర్మ తెలిపారు.
విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న పాలక బీజేపీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షేనని భావిస్తున్నారు. రాజవంశానికి చెందిన తిప్రా మోథా తనది చిన్న పార్టీ అయినా ఈ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం, బీజేపీ కనీసం సగం ఓట్లయినా పొందలేవని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో ఉన్నా.. ఇది నామమాత్రంగానే ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఈ పార్టీ నేత మాజీ సీఎం బిప్లబ్ దేబ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఎం మాణిక్ సాహా కూడా తాము తిరిగి అధికారంలోకి రాగలమని అన్నారు.