త్రిపుర సీఎం మాణిక్ సాహా డెంటల్ డాక్టర్ కూడా అని చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు తెలిసింది. రాజధాని అగర్తల లోని హపానియా ప్రాంతంలో గల మెడికల్ కాలేజీలో పదేళ్ల బాలుడికి ఆయన నిన్న ఓరల్ సర్జరీ చేశారు. పంటినొప్పితో బాధపడుతున్న ఆ కుర్రాడికి విజయవంతంగా ఆపరేషన్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రచారం నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న సాహా … ప్రముఖ మాక్సిలోఫేషియల్ సర్జన్ కూడా.
ఈ సర్జరీ అనంతరం మాట్లాడిన ఆయన.. అక్షిత్ ఘోష్ అనే ఈ బాలుడు ఐదో తరగతి విద్యార్ధి అని, ఆపరేషన్ తరువాత అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మరో 24 గంటల్లో అతడిని డిశ్చార్జ్ చేయవచ్చునన్నారు. ‘చాలా కాలం తరువాత నేను ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు పెట్టాను..కానీ నాకేమీ తేడా అనిపించలేదు.. ఇక్కడ కొన్నేళ్లుగా డెంటల్ సేవలు ఎలా అందించానో ఇప్పుడు కూడా అలాగే సర్జరీ చేశాను’ అని ఆయన తెలిపారు.
ఇంతకాలం తరువాత కూడా మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మీ చేతులు వణకలేదని తన ఫ్రెండ్స్ అన్నారని ఆయన చెప్పారు. సాధారణంగా చాలా గ్యాప్ వచ్చినప్పడు చేస్తున్న వృత్తిలో ఇలా జరగడం పరిపాటి అని, కానీ తానేమీ అలా ఫీల్ కాలేదని అన్నారు.
ఏడు నెలల క్రితం ముఖ్యమంత్రి బాధ్యతలు చేబట్టక ముందు డా. మాణిక్ సాహా.. త్రిపుర మెడికల్ కాలేజీలో ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ డిపార్ట్మెంట్ హెడ్ గా వ్యవహరించారు. నోటి పళ్ల చుట్టూ ఉన్న కణజాలం వద్ద కణితి వంటిది ఏర్పడితే దాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్ నే సాహా చేశారు.