ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది.
గత నెల రోజులుగా పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. అయితే ప్రధానంగా పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మూడు పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించాయి.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 20 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ 55, దాని మిత్ర పక్షం ఐపీఎఫ్‌టీ ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇక సీపీఎం 47, కాంగ్రెస్ 13, టీఎంసీ 28, ఇండిపెండెంట్లు 58 స్థానాల్లో పోటీలో ఉన్నారు.
రాష్ట్రంలో 28.13 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 3328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.