ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో త్రిష మరింత అందంగా కనిపించడమే కాకుండా.. నటనపరంగానూ ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూకట్టాయి. అందులోనూ ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష అందం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన త్రిష.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడం.. వ్యక్తిగత కారణాలతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తాజాగా త్రిష తమిళ్ స్టార్ హీరోతో జత కట్టనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ జోడి సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది.
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ త్రిష కూడా హాజరైంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మళ్లీ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అంచనాలను పెంచేసింది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ మూవీ నుంచి హీరోయిన్ త్రిష తప్పుకున్నట్లుగా కొద్ది రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కొన్ని రోజుల క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో ఆమె కనిపించడమే. దీంతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందంటూ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. అయితే అక్కడి నుంచి పలు ఫోటోస్, వీడియోస్ షేర్ చేసిన త్రిష.. అనుకోకుండా కొద్దిరోజుల క్రితం చెన్నై ఎయిర్ పోర్టులో కనిపించడంతో ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ రూమర్లను ఆమె తల్లి ఉమా కృష్ణన్ కొట్టిపారేశారు. ఫిబ్రవరి 8న ఆమె కాశ్మీర్ నుంచి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. దీంతో త్రిష ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.