సినిమాల్లోకి రావాలనే కసి తప్ప..కరెన్సీ లేని రోజులవి.ఆశ తప్ప అవకాశాలు దొరకని పరిస్థితులవి. తలరాతమార్చుకోడానికి పగలంతా ఆఫీసుల చుట్టూ తిరిగి, రాత్రైతే తలదాచుకోడానికి కాసింత చోటుకావాలి. వాస్తు లేకపోయినా పర్వాలేదు, నామకేవాస్తు ఒక గది ఉంటే చాలు. అదేస్వర్గం.ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా..ఓ అమ్మలా… ఆదరించిన అద్దెగదిని మర్చిపోలేదు. ఇప్పడు స్టార్ అయినా.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ అయినా ఒకప్పటి మూలాలని మర్చిపోలేదు. తాము గడిపిన ‘నాలుగుమూలలని’ మర్చిపోలేదు. త్రివిక్రమ్ – సునీల్ ఆగదికి అద్దెకడుతూనే ఉన్నారు. ఆ గది ఎప్పటికీ వారిదే అంటున్నారు.
త్రివిక్రమ్ కథలు రాసి రచయితగాను అడుగులు వేయగా… సునీల్ సినిమాల్లో నటుడిగా పరిచయం అయ్యేందుకు ప్రయత్నించాడు. తొలిగా సునీల్ అవకాశాలని దక్కించుకోగలిగాడన్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో త్రివిక్రమ్ కు సాయం చేసే వారట. అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకుడిగా ఎదిగిన తర్వాత సునీల్ కు అవకాశాలు ఇప్పించడం, ఇవ్వడం చేసేవారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నారు.
సునీల్ కమెడియన్ గా కెరీర్ ను మొదలు పెట్టి హీరోగా పలు చిత్రాలు చేశాడు. ఇక ఇప్పుడు విలన్ గానూ రాణిస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. అయితే సినిమా అవకాశాల కోసం వచ్చిన కొత్త లో సునీల్, త్రివిక్రమ్ పంజాగుట్ట లోని సాయి బాబా టెంపుల్ దగ్గర ఒక చిన్న గదిలో అద్దెకు ఉండేవారట.
ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అయితే ఇప్పటికీ సునీల్, త్రివిక్రమ్ ఆ రూమ్ రెంట్ కట్టడం విశేషం. ఇద్దరికీ సమయం దొరికినప్పుడు ఆ గదికి వెళ్లి తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపిన క్షణాలను తలుచుకుంటారు. ఈ విషయాన్ని సునీల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది వారి గొప్పతనం…గొప్పగా ఎదిగిన మనిషితనం. మొదలుపెట్టిన చోటుని మరిచిపోలేని తనం.