భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదు? దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బండ్ల గణేశ్ ఎపిసోడ్ కు, త్రివిక్రమ్ స్టేజ్ పై స్పీచ్ ఇవ్వకపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం దర్శకుడు సాగర్ చంద్రను హైలెట్ చేసేందుకు, త్రివిక్రమ్ అలా కావాలనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కనిపించకుండా తప్పుకున్నాడట. ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ ఆయన పవన్ ఫ్యాన్స్ కు చెప్పినట్టు తెలుస్తోంది.
భీమ్లానాయక్ హిట్టయిన సందర్భంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఆఫీస్ ప్రాంగణంలో టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన పవన్ అభిమానులతో త్రివిక్రమ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. భీమ్లానాయక్ సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాననే టాక్ బయటకు వచ్చిందని, చివరికి డైరక్షన్ కూడా తనే చేశానంటూ కొంతమంది తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, వాటిని తిప్పికొట్టేందుకే తను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేదికపై కనిపించలేదని త్రివిక్రమ్ స్పష్టంచేశాడట.
మరోవైపు భీమ్లానాయక్ సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని హీరోలకు, దర్శకుడు సాగర్ చంద్రకు, సంగీత దర్శకుడు తమన్ కు ఆపాదించాడు త్రివిక్రమ్. సాగర్ చంద్ర, ఈ సినిమాను చాలా లోతుగా అర్థం చేసుకున్నాడని, అందుకే మూవీ అంత బాగా వచ్చిందని మెచ్చుకున్నాడు.
తను కేవలం సాగర్ చంద్రకు కావాల్సినవి సమకూర్చిపెట్టే వారధిగా మాత్రమే పనిచేశానని, పవన్ తో మాట్లాడ్డానికి సాగర్ ఇబ్బంది పడినప్పుడు తను సీన్ లోకి వచ్చానని మాత్రమే చెప్పాడు త్రివిక్రమ్.