మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. పూజాహెగ్డే హీరోయిన్ అనే విషయాన్ని ఆమధ్య అధికారికంగా మేకర్స్ ప్రకటించారు కూడా. కానీ పూజాహెగ్డే ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. దీంతో ఆమె త్రివిక్రమ్-మహేష్ సినిమాకు కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేదంటూ చాలా కథనాలొచ్చాయి. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి, ఈ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే తప్పుకుందంటూ స్టోరీలు కూడా వచ్చేశాయి.
ఈ మొత్తం వ్యవహారానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేశాడు త్రివిక్రమ్. మహేష్ తో చేయాల్సిన సినిమాను ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పూజా హెగ్డేను కూడా ఆహ్వానించి, ఇన్నాళ్లూ చక్కర్లుకొట్టిన పుకారుకు తనదైన స్టయిల్ లో చెక్ పెట్టాడు త్రివిక్రమ్
నిజానికి ఓపెనింగ్స్ కు వచ్చేంత టైమ్ పూజా హెగ్డేకు లేదు. ఓపెనింగ్ వచ్చే టైమ్ లో ఆమె మరో సినిమాకు కాల్షీట్ ఇస్తుంది. లేదంటే ఏదైనా ఫ్యాషన్ ఫోటో షూట్ లో పాల్గొంటుంది. లేకపోతే యాడ్ లో నటిస్తుంది. కానీ ఇవన్నీ పక్కనపెట్టి, మహేష్-త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ కు ఆమె వచ్చింది. దీనికి కారణం ఇన్నాళ్లూ నలుగుతున్న పుకార్లను ఆపాలనే ఉద్దేశమే.
అరవింద సమేత సినిమా నుంచి పూజాహెగ్డే తప్ప మరో హీరోయిన్ ను కోరుకోవడం లేదు త్రివిక్రమ్. తాజాగా త్రివిక్రమ్ తీసిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా పూజానే హీరోయిన్. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా పూజానే రిపీట్ చేశాడు ఈ దర్శకుడు. ఇంతకుముందు మహేష్-పూజ కలిసి మహర్షి అనే సినిమా చేశారు.