త్రివిక్రమ్.. ఈ పేరుకు ఉన్న పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైటిల్స్ లో ఆ పేరు పడితే సినిమాకు ఎక్కడలేని మార్కెట్ వస్తుంది. భీమ్లానాయక్ సినిమాకు త్రివిక్రమ్ పేరు అదనపు అడ్వాంటేజ్ గా మారింది. కాబట్టి ఇలాంటి వ్యక్తిని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఈసారి కూడా ఓ సినిమాకు త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడు. కానీ మూవీ టైటిల్స్ లో అతడి పేరు మాత్రం కనిపించదు.
వినోదాయ శితం.. పవన్ చేయబోతున్న రీమేక్ ప్రాజెక్టు ఇది. సముత్తరఖని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు త్రివిక్రమ్. గతంలో భీమ్లానాయక్ సినిమాకు కూడా ఇలానే పనిచేశాడు. టైటిల్స్ లో పేరు పడింది కూడా. కానీ ఈసారి వినోదాయ శితంకు మాత్రం త్రివిక్రమ్ పేరు పడడం లేదు. దీనికి ఓ కారణం ఉంది.
హారిక-హాసిని బ్యానర్ తో త్రివిక్రమ్ కు ఒప్పందం ఉంది. ఆయన ఓ సినిమా చేస్తే అది ఆ బ్యానర్ పైనే చేయాలి. టైటిల్స్ లో త్రివిక్రమ్ పేరు పడాలంటే అది ఆ బ్యానర్ అయి ఉండాలి. కానీ.. వినోదాయ శితం సినిమా పీపుల్ మీడియా బ్యానర్ పై వస్తోంది. కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం త్రివిక్రమ్ పేరు వేయడానికి వీల్లేదు.
దీంతో మధ్యేమార్గంగా, తన బ్యానర్ ను పీపుల్ మీడియాకు ఎటాచ్ చేశాడు త్రివిక్రమ్. తన భార్య పేరిట ఫార్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యానర్ పీపుల్ మీడియాతో కలిసి పవన్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. అలా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ను వాడుకునే వెసులుబాటు కలిగిందన్నమాట.