త్రివిక్రమ్ ఇప్పుడు సంపాదనపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. కేవలం తను డైరక్షన్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే, ఏడాదికి ఒకసారి మాత్రమే సంపాదన ఉంటుంది. ఈమధ్య ఆ గ్యాప్ ఇంకాస్త పెరిగింది కూడా. అందుకే ఈ దర్శకుడు, తన రైటింగ్ తో డబ్బులు సంపాదించే పనిలో పడ్డాడు.
ఆమధ్య భీమ్లానాయక్ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు త్రివిక్రమ్. ఆ సినిమా కోసం దర్శకుడు సాగర్ చంద్ర కంటే, తనే ఎక్కువ మొత్తం అందుకున్నాడు. ఇప్పుడు ఇదే విధంగా వినోదాయశితం రీమేక్ కు కూడా వర్క్ చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా తాజాగా ఈ సినిమా ఓపెన్ అయింది. ఈ రీమేక్ కు కూడా స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు త్రివిక్రమ్. ఇక్కడ కూడా అతడికి భారీగానే ముట్టింది.
ఈ రెండు సినిమాలే కాకుండా.. ఇప్పుడు డీజే టిల్లూ సీక్వెల్ పై కూడా త్రివిక్రమ్ తన చేయి వేసినట్టు తెలుస్తోంది. వీటికి తోడు యాడ్స్ ఉండనే ఉన్నాయి. ఇలా దర్శకత్వం చేయకుండానే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ దర్శకుడు.
త్వరలోనే మహేష్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఈ మాటల మాంత్రికుడు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరక్ట్ చేయబోతున్న సినిమా ఇదే.