హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. రోడ్లపై తనిఖీలు చేపడతూ ఎక్కడిక్కడ వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు వివిధ స్కిక్టర్లను తొలగించడం నుంచి మొదలు, కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రెటీలు అని తేడా లేకుండా రూల్స్ పాటించని వారు ఎవరైనా సరే జరిమానాలు విధిస్తూ తామేంటో చూపిస్తున్నారు. తాజాగా సినీ దర్శకుడు త్రివిక్రమ్‌కి కూడా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
సినీ దర్శకుడు త్రివిక్రమ్ కారుకు సోమవారం జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. రెగ్యులర్ డ్యూటీలో భాగంగా జూబ్లిహిల్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో త్రివిక్రమ్ తన కారులో అటుగా వెళుతున్నారు. అయితే, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌ను గుర్తించిన పోలీసులు వెంటనే ఫిలింను తొలగించారు. అంతేకాకుండా చలాన్ విధించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటుగా వచ్చిన త్రివిక్రమ్ కారును ఆపిన పోలీసులు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించడమే కాకుండా ఫైన్ కూడా విధించారు. ఇప్పటికే ఇలా రూల్స్ పాటించని పలువురు సెలెబ్రిటీలకు పోలీసులు జరిమానాలు విధించారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్ కూడా చేరారు.
టింటెడ్ గ్లాస్ వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. వాహనం కిటికీ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు తమ గోప్యత కోసం అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్నారు. అయితే ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.