“అమ్మ… ఆవకాయ్… అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు!” ‘నువ్వే నువ్వే’ సినిమాలో ఓ డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈరోజుకి ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు.
కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అటువంటి సినిమాల్లో ‘నువ్వే నువ్వే’ ఒకటి. 20 ఏళ్ళైనా, ఇప్పటికీ ఈ సినిమా వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. సినిమాలోని డైలాగులను యూట్యూబ్‌లో మళ్లీ మళ్లీ పెట్టుకొని చూస్తుంటారు.
‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలతో టాప్ రైటర్‌గా ఎదిగిన త్రివిక్రమ్‌ను ‘నువ్వే నువ్వే’తో ‘స్రవంతి’ రవికిశోర్ దర్శకునిగా పరిచయం చేశారు. ఈ చిత్రంతో దర్శకునిగా త్రివిక్రమ్ తన ప్రతిభ చాటారు. పెన్ పవర్ తో పాటు, మెగా ఫోన్ పనితనం కూడా చూపించారు.
‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు, త్రివిక్రమ్ డైలాగులు, కోటి సంగీతం, హరి అనుమోలు సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, పేకేటి రంగ ఆర్ట్ వర్క్, తరుణ్ – శ్రియ లవ్ సీన్స్, ప్రకాశ్ రాజ్- శ్రియ మధ్య సంభాషణలు ఈ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి.
ఇప్పటికీ సినీప్రేమికులు కలిస్తే ‘నువ్వే నువ్వే’ సినిమా టాపిక్ కచ్చితంగా ఉంటుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’గా ‘నువ్వే నువ్వే’ నిలిచింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు.