– కేసీఆర్ వ్యాఖ్యలపై పేలుతున్న పంచ్ లు
– సారు ప్రధాని అవుతారని అమెరికా భయపడుతోందా?
– మన పరిస్థితేంటని చైనా కంగారు పడుతోందా?
– మళ్లీ భారత్ లో కలిపేస్తారని పాకిస్తాన్ కలవరపడుతోందా?
– తెలంగాణ వరదలు విదేశీ కుట్ర అయితే.. ఏ దేశం పని?
– కేసీఆర్ ను దేశ్ కీ నేత కాకుండా అడ్డుకుంటున్నది ఏ కంట్రీ?
ఒకప్పుడు కేసీఆర్ ఓ మాట చెబితే అదే నిజమని నమ్మేవారు జనాలు. అమ్మో.. సారు చెప్పేది నిజమే కాబోలు అంటూ కథలు కథలుగా మాట్లాడుకేనేవారు. కానీ.. రానురాను పస లేని.. పనికి రాని మాటలే ఎక్కువవడంతో సారును పట్టించుకోవడమే లేదు.. అసలు ఆయన చెప్పింది నమ్మడమే మానేసిన పరిస్థితి. అయినా కూడా.. ఏదో ఒకటి అనేసి నలుగురి నోట్లో నానడమే పనిగా కేసీఆర్ పెట్టుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. తాజాగా వరదలకు కారణం విదేశీ కుట్ర అని మాట్లాడడాన్ని ఉదాహరణగా చెబుతూ గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు కొందరు.
గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు కేసీఆర్. ఏరియల్ సర్వే చేద్దామంటే వాతావరణం అనుకూలించలేదు. వరద నీటిలోనే కాన్వాయ్ వెళ్లాల్సి వచ్చింది. మరి.. ఆ చిరాకులో ఉన్నారో ఏమోగానీ.. పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. దేశంలో వరదలకు కారణం క్లౌడ్ బరస్ట్ అని మాట్లాడారు. దీని వెనుక విదేశీ కుట్ర ఉందనేది సారు వాదన. అంతటితో ఆగారా? తెలంగాణ వరదలకు కూడా ఇదే కారణం అయి ఉండొచ్చని.. తమకు సమాచారం ఉందని అనేశారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం షాకయింది. రాష్ట్రంలో వరదలకు, విదేశాలకు సంబంధం ఏంటని సారుపై పంచ్ లు పేలుతున్నాయి.
సోషల్ మీడియాలో కేసీఆర్ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వరదలకు విదేశీ కుట్ర ఏంటి సామి.. ఇంకా నయం నిన్ను దేశ్ కీ నేత అవ్వకుండా అడ్డుకుంటున్నారని అనలేదని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు కేసీఆర్ ప్రధాని అవుతారేమోనని అగ్రరాజ్యాలు వణికిపోతున్నాయి.. అందుకే ఈ కుట్రలు చేస్తున్నాయంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న సారు భారత ప్రధాని అయితే.. మన పరిస్థితి ఏంటని అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు భయపడిపోతున్నాయని.. అందుకే కుట్ర పన్ని తెలంగాణలో భారీ వర్షాలు పడేలా చేశాయేమో అంటూ ఇంకొందరు సెటైరికల్ గా పోస్టులు పెడుతున్నారు.
కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లుందని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అర్థం ఉండాలని.. ఏది పడితే అది మాట్లాడవద్దని సూచిస్తున్నారు. వర్షం కురిపించడంలో విదేశీ కుట్ర ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘమథనం చేసినా వర్షాలు పడలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఇంతకుముందు కూడా ఇలాగే భారత సైనికులపై నోరు పారేసుకుని నవ్వుల పాలయ్యారని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ చిల్లర కామెంట్స్ చేయడం ఏంటని మండిపడుతున్నారు.
నిజంగా సీఎం స్థాయి వ్యక్తి ఏదన్నా అన్నారంటే అందులో కాస్తన్నా అర్థం ఉండాలి. గతంలో కరోనా వచ్చిన కొత్తల్లోనూ ఇలాగే నిర్లక్ష్యంగా ఏదిబడితే అది మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. ‘రాష్ట్రంలో ఎవరికీ కరోనా సోకలేదు. అవసరమైతే రూ.1000 కోట్లు ఖర్చు చేస్తా. కరోనాను మాత్రం రానివ్వం. ఒకవేళ వ్యాపిస్తే తమ సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటాం. కరోనా వస్తే భయపడాల్సిన పని లేదు. పారాసిటమాల్ గోలి వేసుకుంటే సరిపోతుంది’ అంటూ మాట్లాడారు కేసీఆర్. తీరా కరోనా ఉద్ధృతంగా వ్యాపించాక చేతులెత్తేశారు. ఫాంహౌస్ దాటి బయటకు రాలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వరలతో జనం అల్లాడుతుంటే.. ఇన్నాళ్లు గమ్మునుండిపోయి.. గవర్నర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిసి షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. పైగా.. విదేశీ కుట్ర అని మాట్లాడడం చూస్తుంటే ఆయన అయోమయంలో ఉన్నారని అర్థం అవుతోందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. గత వరదలను అంచనా వేయకుండా కట్టిన ప్రాజెక్టుల పుణ్యమే ఇదంతా అని విమర్శిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే విదేశీ కుట్ర అంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు విపక్ష నేతలు.