హరీశ్ శంకర్ మంచి దర్శకుడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇతడు సినిమా తీశాడంటే అది కచ్చితంగా హిట్టవుతుంది. అలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడంతో పాటు, ఫ్యాన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్త పడతాడు ఈ డైరక్టర్. ఇలాంటి డైరక్టర్, పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తాడనగానే, లెక్కప్రకారం ఫ్యాన్స్ ఆనందించాలి .కానీ దానికి రివర్స్ లో జరుగుతోంది వ్యవహారం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాలి. దానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అంతలోనే ఆ సినిమా ఆగిపోయినట్టు కథనాలు వచ్చాయి. తనకు టైమ్ లేకపోవడంతో, పవన్ ఆ సినిమాను పక్కనపెట్టినట్టు వార్తలొచ్చాయి.
అయితే తాజాగా పవన్ తో జరిపిన చర్చల్లో నిర్మాతలు మరోసారి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. సినిమాను లాంఛ్ చేసుకోమని పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట. అయితే ఇదే న్యూస్ తో పాటు, హరీశ్ దర్శకత్వంలో పవన్ ఓ రీమేక్ లో నటిస్తారనే మేటర్ కూడా బయటకొచ్చింది. సరిగ్గా ఇక్కడే పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది.
వరుసపెట్టి రీమేక్స్ చేస్తున్నాడు పవన్. హరీశ్ దర్శకత్వంలో కూడా రీమేక్ అనగానే వీళ్లకు నచ్చలేదు. ఓ స్ట్రయిట్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తే బాగుంటుందనేది పవన్ ఫ్యాన్స్ కోరిక. దీంతో హరీశ్ పై వరుసగా పోస్టులు పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్. వీలైతే ఓ కొత్త కథతో పవన్ తో సినిమా చేయాలని, రీమేక్ సబ్జెక్ట్ అయితే మాత్రం దయచేసి పవన్ తో సినిమా చేయొద్దని అతడి ఫ్యాన్స్, హరీశ్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.