– ఐపీఎల్ లో మరో ప్లాప్ షో
– లక్నో మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్
– విరాట్ పై మాజీ క్రికెటర్ల విమర్శలు
రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఏమైంది. ఇప్పుడు ఫ్యాన్స్ ను ఈ ప్రశ్న బాగా తొలిచేస్తోంది. వేల పరుగులు చేసిన కోహ్లీ.. ఈ సీజన్ లో తన స్థాయి పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఒంటిచెత్తో విక్టరీలు అందించే రికార్డుల రారాజు.. చెత్త బాల్స్ కు ఔటవుతున్నాడు. వికెట్ల మధ్య స్పీడ్ గా పరిగెత్తే కోహ్లీ.. రన్ అవుట్ లు అవుతున్నాడు.
2022 ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ ప్లాప్ షో కొనసాగుతోంది. లక్నో మ్యాచ్ లోనూ విరాట్ గోల్డెన్ డక్ అయ్యాడు. సీజన్ లో ఒకటీ రెండు మినహా మిగతా మ్యాచ్ లలో కోహ్లీ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కోహ్లి కేవలం 119 రన్స్ మాత్రమే. అందులో హైయస్ట్ స్కోర్ 48.
2022 ఐపీఎల్ లో ఆర్సీబీ సూపర్ పర్ఫామెన్స్ చేస్తున్నా.. విరాట్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. ఫ్రాంచైజీ 15 కోట్లకు కోహ్లీని రిటైన్ చేసుకుంది. టీమిండియాలో కోహ్లీ ఫెయిల్ అవుతున్నా.. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తాడని బెంగళూరు ఫ్రాంచైజీ అనుకుంది. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన కోహ్లీ.. బ్యాట్ తో ఇరగదీయడం ఖాయమని, మళ్లీ రన్ మెషీన్ ను చూడొచ్చని అభిమానులు ఆశించారు. కానీ.. అలా జరగడం లేదు. ఈ సీజన్ లో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా ఉందంటే అతని పర్ఫామెన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకుకోవచ్చు
లక్నోతో జరిగిన మ్యాచ్ లో మళ్లీ కోహ్లీ డకౌట్ అయ్యాడు. లక్నో బౌలర్ చమీరా వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని బ్యాక్ వర్డ్ పాయింట్ ఫీల్డర్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. గత మూడేళ్లుగా కోహ్లీ ఆటతీరు చాలా మారింది. గతంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తే.. ఇప్పుడు డిఫెన్స్ ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ ఆటపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. విరాట్ పనైపోయిందని, రిటైర్మెంట్ ఇవ్వాలని ట్రోల్ చేస్తున్నారు.
కోహ్లీకి మాజీ క్రికెటర్లు సపోర్ట్ చేస్తున్నారు. మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఒక్క ఇన్సింగ్స్ చాలంటున్నారు. ఒక్కసారి ఫామ్ అందుకుంటే.. విరాట్ ను ఆపడం ఎవరి వల్ల కాదని చెబుతున్నారు. ఆటపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. అభిమానులు కూడా విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.