లవ్ టుడే అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో పాపులర్ అయిపోయాడు ప్రదీప్ రంగనాధన్. ఆ సినిమాను తనే డైరక్ట్ చేసి, హీరోగా నటించాడు ప్రదీప్. తమిళనాట అది పెద్ద హిట్టయింది, అక్కడితో ఆగకుండా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్టయింది.
దీంతో ప్రదీప్ ను ప్రత్యేకంగా తన ఇంటికి పిలిచి సన్మానించారు రజనీకాంత్. ప్రదీప్ టాలెంట్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అయితే ఆ ఫొటోను తళైవ ఫ్యాన్స్ మరోలా అర్థం చేసుకున్నారు. ప్రదీప్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
రజనీ 171వ సినిమాకు ప్రదీప్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్, స్టోరీస్, మీమ్స్ పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన ఓ మీమ్ కు లైక్ కొట్టాడు ప్రదీప్. సరిగ్గా ఇక్కడే రజనీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు.
మీమ్స్ కు లైక్ కొట్టడం వరకు ఓకే. కాకపోతే ఆ మీమ్ కింద కంటెంట్ లో రజనీకాంత్ ఫ్యాన్స్ పిచ్చోళ్లు అనే వ్యాఖ్య కూడా ఉంది. దానికి ప్రదీప్ లైక్ కొట్టడంతో రజనీ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి దీనిపై ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.