– కొనసాగుతున్న విద్యార్థుల చావులు
– ఏం పట్టనట్టుగా మంత్రి తీరు!
– పార్టీ కార్యక్రమాలపై ఉన్న చొరవ..
– విద్యార్థులపై లేదని విమర్శలు
ఈమధ్య కాలంలో తెలంగాణలో విద్యార్థుల చావులు కలకలం రేపుతున్నాయి. ర్యాంగింగ్ అని ఒకరు, కాలేజీల ఒత్తిళ్లకు మరొకరు, అనుమానాస్పదరీతిలో ఇంకొకరు.. ఇలా పలువురు మృత్యుఒడికి చేరారు. అయితే.. ఆయా ఘటనలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తున్న తీరుపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ ప్రశ్నిస్తున్నారు.
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు మెడికో స్టూడెంట్ ప్రీతి ఘటన సంచలనం రేపింది. అదే తరహాలో వరంగల్ జిల్లాలో రక్షిత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వీరి మరణాల వెనుక యాజమాన్యాల ఒత్తిళ్లు, ర్యాగింగ్ వేధింపులేననే ఆరోపణలు ఉన్నాయి.
నిత్యం విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే.. మంత్రి సబిత తన శాఖ పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో ఇలాంటి దారుణాలను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థులు చనిపోతుంటే సరిగ్గా స్పందించడం లేదని.. అదే గ్యాస్ ధరల పెరుగుదలపై పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమంలో మాత్రం రోడ్డెక్కి ప్లకార్డులతో ఎంతో ఉత్సాహంగా ధర్నాలో పాల్గొన్నారని మండిపడుతున్నారు.
మరోవైపు బాలల హక్కుల సంఘం సైతం స్పందించి మంత్రి తీరును తప్పుబట్టింది. విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ మంత్రికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కరెక్ట్ కాదని తెలిపింది. గ్యాస్ ధర పెంపునకు ఆమెకు ఏం సంబంధం అని ప్రశ్నించింది.