ఉన్నంతలో వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు రాజమౌళి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. అయితే జక్కన్న ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని సార్లు ట్రోలింగ్ ఎదుర్కొనక తప్పలేదు. ఈసారి కూడా రాజమౌళికి అలాంటి పరిస్థితే ఎదురైంది. మంచికి పోతే చెడు ఎదురైందన్నట్టు.. ఓ మంచి పని కోసం ట్వీట్ చేస్తే, ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇంతకీ మేటర్ ఏంటంటే… దేవిక అనే ఆవిడ బ్లడ్ కాన్సర్ బారిన పడింది. ఆమె పోస్ట్ ప్రొడక్షన్ కో-ఆర్డినేటర్. బాహుబలి సినిమాకు కూడా ఆమె వర్క్ చేసింది. చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్న దేవిక, బ్లడ్ కాన్సర్ బారిన పడిందని.. ఫండ్ రైజింగ్ ద్వారా ఆమెను ఆదుకోవాలని ఓ లింక్ షేర్ చేశాడు రాజమౌళి. సరిగ్గా ఇక్కడే నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యాడు జక్కన్న.
ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే రాజమౌళి, దేవికను ఆదుకోవచ్చు కదా అనేది నెటిజన్ల ప్రశ్న. మరీ ముఖ్యంగా ప్యాకేజీ రూపంలో రెమ్యూనరేషన్ తీసుకునే రాజమౌళికి దేవిక లాంటి వాళ్లను ఆదుకోవడం పెద్ద సమస్య కాదని, అలాంటి వ్యక్తి ఇలా ఫండ్ రైజింగ్ మొదలుపెట్టడం ఏం బాగాలేదంటున్నారు నెటిజన్లు.
నిజానికి రాజమౌళి తన వంతు సహాయం చేసే ఉంటాడు. ఆల్రెడీ దేవిక స్టార్ట్ చేసిన ఫండ్ రైజింగ్ లింక్ ను ఆయన జస్ట్ షేర్ చేశారంతే. ఈమాత్రం దానికే ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. రాజమౌళి పిలుపునకు స్పందించి చాలామంది, ఆ లింక్ ద్వారా దేవికకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఓవైపు తనపై ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ, అనుకున్న లక్ష్యం నెరవేరినందుకు రాజమౌళి హ్యాపీ.