సమంత, విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ పెట్టారు. నిన్న మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి, టైటిల్ ను ప్రకటించారు. ఇలా టైటిల్ వచ్చిందో లేదో అలా పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు.
పవన్ కల్యాణ్ నటించిన కల్ట్ మూవీ ఖుషి. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ నటించిన ఆ సినిమా, అతడి ఫ్యాన్స్ కు ఎప్పుడూ అపురూపమే. అలాంటి సినిమా టైటిల్ ను విజయ్ దేవరకొండ వాడేయడాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది.
ఈ విషయానికి, సమంతకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. సినిమాలో ఆమె కూడా ఉంది కాబట్టి సమంతను కూడా ట్రోల్ చేశారు పవన్ ఫ్యాన్స్. ఇప్పటికైనా మంచి పోయింది లేదు, టైటిల్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఖుషి ప్రొడ్యూసర్ ఏఎం రత్నంను కూడా ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇలాంటి కల్ట్ సినిమాలకు సంబంధించి టైటిల్ హక్కులు వదిలేసుకొని నిర్మాత తప్పుచేశారని ఆరోపిస్తున్నారు. అతి తక్కువ సొమ్ముతో ప్రతి ఏటా ఖుషి టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రెన్యువర్ చేయించుకోవచ్చని, నిర్మాత ఆ పని చేయలేదని పవన్ ఫ్యాన్స్ ఆక్రోషిస్తున్నారు.