తన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి పటియాలా హౌస్ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ పోలీసులు గురువారం ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. 2014 జనవరి 17 రాత్రి సునంద పుష్కర్ ఓ లగ్జరీ హోటల్ లోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అయితే ఈ కేసు నుంచి పటియాలా కోర్టు.. 2021 ఆగస్టులో శశిథరూర్ ని విముక్తుడిని చేసింది. సునంద పుష్కర్ ని ఆత్మహత్య చేసుకునేలా ఆమెను ప్రేరేపించారనడానికి ఆధారాలు లేవని కోర్టు నాడు పేర్కొంది.
పైగా ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు తగినంతగా లేవని కోర్టు వ్యాఖ్యానించింది. సునంద పుష్కర్ ని ఆయన మానసికంగా వేధించారనడానికి రుజువులు లేవని .. మొత్తానికి ఆయనను నిర్దోషిగా పేర్కొంది.
2018 మే 15 న ఢిల్లీ పోలీసులు శశిథరూర్ పై 3 వేల పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని థరూర్ తోసిపుచ్చారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అప్పీలును పురస్కరించుకుని ఈ కేసుపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 న విచారణ జరగాలని కోర్టు నిర్ణయించింది.