అర్జున్ కపూర్ నటించిన ”పానిపట్” సినిమాకు కష్టాలొచ్చాయి. సినిమాపై రాజస్థాన్ కు చెందిన రాజకుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి ఆ రాష్ట్ర మంత్రి కూడా మద్ధతు తెలుపుతున్నారు. 1761 లో మరాఠాలకు-ఆప్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దాలికి మధ్య జరిగిన మూడో పాణిపట్టు యుద్ధం ఆధారంగా డైరెక్టర్ అశుతోష్ గోవరికర్ ఈ సినిమాను తెరకెక్కించారు.
డిసెంబర్ 6న విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇంతలోనే దీనిపై వివాదం మొదలైంది. తమ పూర్వీకుడు భరత్ పూర్ మహారాజ సూరజ్ మల్ ను సినిమాల్లో అవమానపర్చారని రాజస్థాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ ఆరోపిస్తున్నారు. పానిపట్టు యుద్ధం ముగిశాక తిరిగొచ్చేటప్పుడు మహారాజు సూరజ్ మల్ మరాఠా సైనికులకు సహకరించలేదన్నట్టుగా సినిమాలో చూపించి జాట్ల మనోభావాలను కించపర్చారని విశ్వేంద్ర సింగ్ అంటున్నారు.
గొప్ప రాజు అయినటువంటి మహారాజు సూరజ్ మల్ కు సంబంధించిన చారిత్రక వాస్తవాలను మర్చిపోయి ఆయన్ను తప్పుడుగా చిత్రీకరించారని అన్నారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరభారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సినిమా పట్ల వ్యతిరేకత వస్తుండడంతో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయని హెచ్చరించారు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆత్మ గౌరవం కలిగిన గొప్ప రాజైనటువంటి సూరజ్ మల్ ను తప్పుగా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.అర్జున్ కపూర్, సంజయ్ దత్, క్రితీసనన్ లు పానిపట్ లో నటించారు.