వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెలరోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. దివంగత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు చేపట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలోని రచ్చబండకు హాజరయ్యారు. ఇటు పార్టీలోని కీలక నేతలు, ఇతర నాయకులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.
విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపుచేశారు. ఈ క్రమంలో పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మొగిలిపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.