అకాల వర్షాలకు తెలంగాణలో చాలామంది రైతులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. సిరిసిల్ల రైతులను పరామర్శిస్తానని ముందుగానే ప్రకటించారు. చెప్పినట్లుగా అక్కడకు బయలుదేరారు.
మార్గమధ్యంలో సిద్దిపేట జిల్లా జక్కపూర్ లో పోలీసులు పాల్ ను అడ్డుకున్నారు. పర్మిషన్ లేదు.. వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారు. అయితే.. వారిని కన్విన్స్ చేసి సిరిసిల్ల వెళ్దామని ప్రయత్నించారు పాల్. అదే సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో పాల్ మాట్లాడుతుండగానే ఓ టీఆర్‌ఎస్ నేత దగ్గరగా వచ్చి చెంప చెళ్లుమనిపించాడు.
అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో పాల్ బిత్తరపోయారు. ఆయన అనుచరులు, పోలీసులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పాల్ ను తన వాహనంలోకి ఎక్కించి అక్కడ నుంచి పంపించేశారు.
పోలీసుల తీరుపై మండిపడ్డారు కేఏ పాల్. ప్రభుత్వ ఉద్యోగులా లేక టీఆర్‌ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటుగా స్పందించారు. జీతాలు టీఆర్‌ఎస్ ఇస్తోందా లేదా ప్రభుత్వం నుంచి వస్తున్నాయా అంటూ మండిపడ్డారు. కొద్దిరోజులుగా కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు పాల్. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ నేత దాడి చేశాడు.