నేను కొట్టినట్లు చేస్తా… నువ్వు ఏడ్చినట్లు చేయి… ఈ ఫార్మూలాతోనే టీఆర్ఎస్-ఎంఐఎం నడుస్తున్నట్లు కనపడుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో ఉన్న అధికార టీఆర్ఎస్, మిత్రపక్షం ఎంఐఎం ఈ కొత్త నాటకానికి తెరతీసినట్లుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్ పై ఎంఐఎం ఒక్కమాట అనలేదు. లాక్ డౌన్ సందర్భంగా ఎన్ని ఇబ్బందులు కనపడ్డ స్పందించలేదు. కానీ జనం దుమ్మెత్తిపోసే సరికి హాఠాత్తుగా టీఆర్ఎస్ పై ఎంఐఎం దూకుడు పెంచినట్లు నటిస్తుందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు సర్కార్ ను కూల్చేస్తాం అని, మరోవైపు టీఆర్ఎస్ ను ప్రచారానికి కూడా రానివ్వకుండ అడ్డుకోవటం చూస్తుంటే ఎంఐఎంకు ఇబ్బంది లేకుండా టీఆర్ఎస్ సహకరిస్తున్నట్లు కనపడుతుంది. లేదంటే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎంఐఎంపై ఒంటికాలిపై లేచేవారు. అలా జరగలేదంటేనే ఫ్రెండ్లీ విమర్శల కింద లెక్కగట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ టీఆర్ఎస్-ఎంఐఎంను టార్గెట్ చేయటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ రెండు పార్టీలు మేం ఒకటి కాదు అని జనాల్ని నమ్మించే ఉద్దేశంతోనే ఆరోపణలకు దిగుతున్నారని, ఇది ఎన్నికల కోసం మొదలుపెట్టిన కొత్త నాటకమని విమర్శిస్తున్నారు. ఈ నాటకాన్ని జనం ఏమాత్రం నమ్మినా… డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం నుండి వారి అసలు స్వరూపం భయటపడుతుందని, గ్రేటర్ పీఠానికి ఎంఐఎం అవసరం ఉంటే అవసరం అయితే అధికారాన్ని పంచుకునే వరకు వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.