సీఎం కేసీఆర్ రైతుల భారత్ బంద్ మద్ధతు తర్వాత అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లారు. అప్పటి వరకు తిట్టిన కేంద్రమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన ఆయన సడన్ గా కామ్ అయిపోయారు. నిరుద్యోగ అంశమే రాష్ట్రంలో లేనట్లుగా ఉన్న కేసీఆర్, ఢిల్లీ నుండి వస్తూనే… 50వేల ఉద్యోగాల ప్రకటన చేశారు. జెట్ స్పీడ్ లో నియామకాలు చేయాలని ఆదేశించారు. ఇక ఎల్.ఆర్.ఎస్, ధరణి రిజిస్ట్రేషన్లపై ఉన్నతస్థాయి మీటింగ్ పెట్టి తేల్చేద్దాం అంటూ నిర్ణయించారు.
కానీ ఆదివారం నుండి జరగాల్సిన మీటింగ్స్ అన్నీ రద్దయిపోయాయి. సోమవారం కేంద్రమంత్రి గడ్కరీతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ భేటీకి కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు. తను కోలుకున్నాక కేసీఆర్ ను కలుస్తానంటూ గడ్కరీ ప్రత్యేకంగా ప్రస్తావించటంతో కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారన్న విషయం భయటకు పొక్కింది.
ఢిల్లీ నుండి వచ్చాక రెండ్రోజులకు కేసీఆర్ అనారోగ్యానికి గురవటానికి గల కారణం ఏంటీ, ఆదివారం ఉన్నత స్థాయి కీలక సమావేశం ఏర్పాటు చేసి… ముందురోజే మీడియాకు సమాచారం కూడా అందించి, కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితం అయ్యారంటే ఆయనకు ఏమై ఉంటుందన్న ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతుండగా, సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రకటన చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ఆయన అనారోగ్యం నిజమైందేనా… లేదంటే ఫాంహౌజ్ నుండి భయటకు రాలేక, కేంద్రమంత్రులతో సమావేశం ఇష్టంలేక అనారోగ్యం అని చెప్పారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.