– మహిళా మంత్రి లేకుండానే ఒక టర్మ్ పూర్తి
– కుక్కలు అంటూ సీఎం వ్యాఖ్యలు
– సారు ఇన్ స్పిరేషన్ తోనే రెచ్చిపోతున్న గులాబీలు
– డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఒకరు..
– ఆకతాయిల మాదిరి మరొకరు
– మహిళా అధికారులు, నేతలకు అవమానాలు
– గవర్నర్ ను సైతం వదలని వైనం
– మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని అర్థం. అదే ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు. ఇది పెద్దలు చెప్పే నీతి. మరి.. తెలంగాణలో మహిళలకు గౌరవం లభిస్తోందా? గులాబీ రాజ్యంలో స్త్రీలకు రక్షణ లేదా? అంటే అవుననే సమాధానం రాజకీయ పండితుల నుంచి వస్తోంది. 2014లో కేసీఆర్ గద్దెనెక్కిన సమయం నుంచి మహిళా నేతలకు.. సామాన్య స్త్రీలకు ఎదురయిన అవమానాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ తో 2014 ఎన్నికల్లో విజయం సాధించింది టీఆర్‌ఎస్ పార్టీ. అయితే.. మహిళలు ఓట్లు వేయడానికి మాత్రమే ఉన్నారు.. పాలించడానికి కాదు అన్నట్టు.. టీఆర్‌ఎస్ లో వారికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. బహుశా యావత్ దేశంలోనే రాష్ట్ర కేబినెట్ లో ఒక్కరంటే ఒక్క మహిళా మంత్రి కూడా లేకుండా ఒక టర్మ్ పదవీకాలం పూర్తిచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ దే అయి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. రెండోసారి ఎన్నికల సమయంలో అయినా.. మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ టికెట్లు కేటాయిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ.. వేళ్ల మీద లెక్క పెట్టేలా కొందరికే ఇచ్చారు. పోనీ రెండో టర్మ్ లో అయినా మహిళలకు మంత్రి పదవులు వెంటనే ఇస్తారా అనుకుంటే చాలారోజులు మంత్రివర్గమే లేకుండా పాలన సాగించారు. ఈ విషయంలో విమర్శలు రావడంతో ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించారు.
హైదరాబాద్ కు గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా వస్తే.. కనీసం మహిళా నేతలు పలకరించేందుకు వెళ్లని పరిస్థితి. ఈ క్రమంలోనే మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్ కు ఎవరూ సాటి రారనే విమర్శలు వచ్చాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయని చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో నల్గొండ జిల్లా హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు కేసీఆర్. ఆ సమయంలో కొందరు మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపితే కుక్కలు అని సంభోదించారు. ఈ కామెంట్స్ అప్పట్లో పెద్ద రచ్చకు దారి తీశాయి. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. అయినా కూడా ఆయన తీరులో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలో మహిళలకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
నాయకుడే అలా ఉంటే.. ఆయన కింద ఉండే లీడర్లు ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొన్నారు. అప్పుడు మహిళా ఎంపీడీవోతో అసభ్యకరంగా మాట్లాడారు. అందరి ముందే ఆమెను అవమానించారు. ఈ ఇష్యూ.. అప్పట్లో జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ వరకు వెళ్లింది. అయినా కూడా మంత్రి తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. కేవలం అధికారులే కాదు.. సొంత పార్టీలోని మహిళా నేతలు కూడా ఎన్నో అవమానాలను చవిచూస్తున్నారు.
తాజాగా వరి ధాన్యం విషయంలో టీఆర్‌ఎస్ ధర్నాలు నిర్వహించగా.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ సెంటర్ లో చేపట్టిన కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఆ సమయంలో కవిత సభలో మాట్లాడుతుండగా శంకర్ నాయక్ బలవంతంగా మైక్ ను లాగేసుకున్నారు. తాను ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నానని కవిత చెప్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే మైక్ లాక్కోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెంలో అయితే ఏకంగా ఆకతాయిల మాదిరి ప్రవర్తించారు టీఆర్‌ఎస్ నేతలు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి రామాపురం వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించగా.. ఓ ద్విచక్ర వాహనం వెనుకవైపు కూర్చున్నారు మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి. ఆమె వెళ్తున్న వాహనం వెనుకే ఉన్న కొందరు టీఆర్‌ఎస్ నేతలు బైక్ తో పదే పదే తాకారు. ఈ క్రమంలోనే ఆమె చీర జారిపోయినంతపనైంది. దండం పెడతా అని ప్రాధేయపడ్డా వినిపించుకోలేదని లక్ష్మీదేవి కన్నీరుమున్నీరయ్యారు.
ఇక రాష్ట్ర గవర్నర్ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సైతం తప్పుబడుతున్నారు విశ్లేషకులు. ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో వ్యతిరేకంగా వ్యవహరించారనే ఒక్క కారణంతో పదే పదే ఆమెను అవమానిస్తూ వచ్చారని.. ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించలేదని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు గవర్నర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో అనరాని మాటలు అంటున్నారని.. సంస్కార హీనంగా కొందరు తిడుతున్నారని ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనని ఇంకా బయటకు రాని ఎన్నో ఘోరాలు రాష్ట్రంలో ఉన్నాయని చెబుతున్నారు. సిరిసిల్లలో బాలికపై టీఆర్‌ఎస్ నేత అఘాయిత్యం గానీ.. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు వేధింపులకు కుటుంబం బలి కావడం.. ఇలా అనేక విషయాల్లో మహిళలను కించరిస్తూ.. వేధిస్తూ.. అవమానాలకు గురి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.