సూర్యాపేట జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా లక్కవరం గ్రామంలో వైఎస్ఆర్టీపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ షర్మిల ధర్నాకు దిగారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని లక్కవరంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ప్రజా గాయకుడు, ఏపురి సోమన్న పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంతో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైఎస్ఆర్టీపీ శ్రేణులు.
వైఎస్సార్‌టీపీ అధినేత్రి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, వెంటనే దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
అంతకుముందు ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష 31వ వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా షర్మిల ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే KCRకు మాత్రం 80వేలే కనిపిస్తున్నాయని, ఎనిమిదేండ్లుగా నిరుద్యోగుల్ని మభ్య పెట్టింది చాలని, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడంతో పాటు కొత్త జిల్లాల వారిగా ఖాళీలను గుర్తించాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.