తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక హస్తిన పర్యటన రాజకీయవర్గాల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై కేసీఆర్ రగిలిపోయిన తీరును చూసి.. ఇప్పట్లో ఆయన ప్రధాని మోదీ మొహం కూడా చూడరేమో అని అంతా అనుకున్నారు. కానీ గ్రేటర్ ఫలితాలు వెలువడి వారం పూర్తయిందో లేదో ఢిల్లీ ఫ్లైటెక్కి షాకిచ్చారు గులాబీ బాస్.
గతంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారంటే.. వారం ముందు నుంచే హడావుడి కనిపించేది. కానీ ఇప్పుడు.. ఆయన వెళ్లేరోజు వరకూ వెళ్తారో లేదోనన్న క్లారిటీ లేని పరిస్థితి నెలకొని ఉంది. కానీ అదేం విచిత్రమో కేసీఆర్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లినప్పటికీ..ఎవరూ ఊహించని ప్రాధాన్యత ఆయనకు దక్కింది. కేసీఆర్ అలా అడగడమే ఆలస్యం… ఇలా అందరి అపాయింట్‌మెంట్లూ దొరికేశాయి. ఇదే ఏపీ సీఎం జగన్ విషయంలో అయితే.. నెల రోజుల ముందు నుంచే అపాయింట్‌మెంట్ కోరినా కేంద్ర పెద్దలు కనీసం కన్నెత్తి చూడని దాఖలాలు ఉన్నాయి. అలాంటిది మొన్నటికి మొన్న గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై దుమ్మెత్తిపోసిన కేసీఆర్‌కు.. అడిగిన వెంటనే అనుమతి దొరకడం చూసి రాజకీయ వర్గాలు అవాక్కవుతున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌కు మద్దతిచ్చిన కేసీఆర్..ఆ తర్వాత ఏమైందో తెలియదు వెంటనే దానికి ప్రాయోశ్చిత్తం అన్నట్టుగా పార్లమెంట్ కొత్త భవన నిర్మాణాన్ని పొగుడుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.ఆ వెంటనే ఢిల్లీ దారిపట్టారు. వెళ్లీ, వెళ్లగానే మోడీ, అమిషాలతో ఏకాంత చర్చలు జరిపారు. సాధారణంగా రాష్ట్ర సమస్యల గురించి అయితే వెంటనే ప్రెస్‌నోట్ వచ్చేది.. కానీ అదేమిటో విడ్డూరంగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండ్ సంజయ్‌కు ఢిల్లీ నుంచి హుటాహుటిన పిలుపు రావడం బీజేపీ శ్రేణులను కూడా షాక్‌కు గురి చేస్తోంది.
కేసీఆర్ ఢిల్లీ ఎపిసోడ్ ఇంత రక్తికట్టడానికి కారణం మాత్రం మళ్లీ ఆ ముగ్గురేనని తెలుస్తోంది. యధావిధిగా తెలంగాణకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త, ఓ కేంద్ర మంత్రి, ఓ స్వామిజీ ముగ్గురూ ముందుండి ఇదంతా నడిపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏమో లోగుట్టు ఢిల్లీ పెద్దలకెరుక!