– సిన్హా విషయంలో కేసీఆర్ అతి చేస్తున్నారా?
– ఓడిపోతారని తెలిసినా ఎందుకింత ఆర్భాటం
– బీజేపీ కార్యవర్గ సమావేశాల సమయంలోనే ఎందుకిలా?
– కమలదళానికి హైప్ రాకూడదని చూస్తున్నారా?
– పోటాపోటీగా ఫ్లెక్సీలు అవసరమా?
– కేసీఆర్ కు బీజేపీ నేతల సూటి ప్రశ్నలు
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. అయితే.. బీజేపీ అనూహ్యంగా గిరిజన నేత ద్రౌపది ముర్ముకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో విపక్ష పార్టీలకు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ ఓట్ల విలువ 48.9 శాతంగా ఉంది. విపక్షాల మొత్తం బలం 51.1 శాతం. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీఏకు మరో 1.1 శాతం ఓట్లు అవసరం. ప్రతిపక్షాలు సిన్హాను బరిలోకి దింపాయి. అయితే.. ఆయనకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయా? అనేది కష్టంగా మారింది.
ముర్ము ఒడిశాకు చెందిన నేత. దీంతో నవీన్ పట్నాయక్ పార్టీ ఆమెకు మద్దతు ఇవ్వకుండా ఉండదు. అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీఏ వైపే ఉంది. ఇక మహారాష్ట్రలో అధికారం చేతులు మారాక ఎన్డీఏ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ పరిణామాల నడుమ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముర్ముకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆమెను నిలబెడుతున్నట్లు ముందే చెప్తే మద్దతు ఇచ్చే వాళ్లం కదా అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ తో ప్రతిపక్ష పార్టీల్లో కాస్త గందరగోళం నెలకొంది.
అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు యశ్వంత్ సిన్హా. పూర్తిస్థాయిలో ఆయనకు బలం లేదని తెలిసినా.. మద్దతిస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఓడిపోతారని తెలిసినా.. ఇంత అతి చేయడం అవసరమా? అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. పైగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలోనే ఇలా చేయడంపై మండిపడుతున్నారు. పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆర్భాటం చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యశ్వంత్ కు మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. సిన్హా విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తున్న బీజేపీ నేతలు కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. నవీన్ పట్నాయక్ పార్టీ, వైసీపీ తమకే మద్దతు తెలుపుతున్నాయని.. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ గా ఉన్నాయని చెబుతున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక పరిస్థితులు మారయని గుర్తు చేస్తున్నారు. అలాంటిది సిన్హా గెలుస్తారని కేసీఆర్ చెప్పడం ఏంటని.. ఇది మేకపోతు గాంభీర్యమేనని చెబుతున్నారు బీజేపీ నేతలు.