పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ.. నడిరోడ్డు మీద నానా హంగామా చేశాడు. అదేందని ప్రశ్నించిన మహిళపై దాడికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గోదావరి ఖని ఉదయ్ నగర్ కు చెందిన చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి.. తన ఇంటిముందు బైక్ ను పార్క్ చేశాడు. అదే సమయంలో రామగుండం 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య తన కారుతో.. పార్క్ చేసి ఉన్న బైక్ ను ఢీ కొట్టాడు. దాన్ని ప్రశ్నించిన వేణుగోపాల్ రెడ్డిపై కార్పొరేటర్.. తన అనుచరులతో పాటు దాడికి దిగాడు. అడ్డం వచ్చిన వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమిద కుమారిని చితకబాదారు.
మాజీ కార్పోరేటర్ ధరణీ జలపతి, టీబీజీకేఎస్ నాయకుడు పోలాడి శ్రీనివాస్ రావు, జువ్వాడి వెంకట్ లు తనపై దాడికి పాల్పడ్డారని ప్రమిద కుమారి ఆరోపించింది. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జర్నలిస్ట్ కుమార్, సీఐటీయూ నాయకుడు మెండ శ్రీనివాస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు బాధితురాలు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఇంట్లోకి చొరబడి బూతులు తిడుతూ బీభత్సం స్పష్టించారని ఆవేదన వ్యక్తి చేస్తున్నారు.
ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చినప్పటికీ.. కార్పొరేటర్ అనుచరులు వారి ముందే దాడికి యత్నించారు. ఈ ఘటనలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బాధితులను వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కు చెందిన మరో కార్పొరేటర్ అదే కాలనీ లో పోచమ్మ వైన్స్ పై దాడి చేసి ఇద్దరిని చితక బాదాడు. మద్యం ఉచితంగా ఇవ్వాలంటూ కౌంటర్ పై ఉన్నవారిపై దాడి చేశాడు టీఆర్ఎస్ కార్పొరేటర్. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రజలపై దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.