బోడుప్పల్ లో అధికార పార్టీ కార్పొరేటర్ రెచ్చి పోయారు. కార్పొరేషన్ పరిధిలోని గ్లోబల్ చాంప్ ప్రైవేట్ పాఠశాల మహిళా ప్రిన్సిపల్ పై కార్పొరేటర్ దాడికి దిగారు. మహిళ అని చూడకుండా ఆమెపై కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దాడి చేశారు.
ఘటన వివరాల్లోకి వెళితే… బోడుప్పల్ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నర్సింహాకు చెందిన భవనంలో గ్లోబల్ చాంప్స్ స్కూల్ నడుస్తోంది. దాని కోసం నర్సింహాకు స్కూల్ యాజమాన్యం అద్దె చెల్లిస్తోంది.
కరోనా సమయంలో బాకీ ఉన్న అద్దెను ఇవ్వక పోవడంతో కార్పొరేటర్ నర్సింహాకు కోపం వచ్చింది. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ కామేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి కార్పొరేటర్ దాడి చేశారు.
దీనిపై పోలీసులకు ప్రిన్సిపల్ కామేశ్వరి ఫిర్యాదు చేశారు. తనపై దాడికి దిగిన కార్పొరేటర్, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ కోరుతున్నారు. ఇదే స్కూల్ కు సంబంధించి అద్దె విషయంలో కోర్టు పరిధిలో కోర్టు కేసు నడుస్తుండటం గమనార్హం.