తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపనలో బిజీగా ఉండగా.. స్థానికంగా అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉలిక్కిపాటు మొదలైంది.
ఇప్పటికీ ఆమె సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతుండగా.. జంటనగరాల రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తోన్న పీజేఆర్ కుటుంబం పూర్తిగా తిరిగి సొంతగూటికి చేరినట్టైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విజయారెడ్డి.. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
గ్రూపు తగాదాలు, సరైన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలతో కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్ పై అసంతృప్తితో ఉన్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి.. శనివారం ఉదయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ నిరసనలపై రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టగా.. ఆయనతో కలిసి విజయారెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు విజయారెడ్డి. కాంగ్రెస్ చేరుతున్నానంటే.. ఇంటి పార్టీలోకి వస్తున్నాననే భావన కలుగుతోందన్నారు. టీఆర్ఎస్ లో అప్పగించిన బాధ్యతలను సరైన విధంగా నిర్వహించినప్పటికీ తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఒక బౌండరీ లైన్ గీస్తున్నానన్నారు విజయారెడ్డి. అయితే.. తన శక్తి సామర్థ్యాన్ని చాటాలంటే కాంగ్రెస్ పార్టే సరైన వేదిక అని నిర్ణయించుకుని.. కాంగ్రెస్ చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఆశతో కాంగ్రెస్ లోకి వచ్చానని కొందరు క్రియేట్ చేయవచ్చు కానీ.. తాను టికెట్ ఆశించి రాలేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. టికెట్ గురించి ఇప్పుడేం మాట్లాడనని అన్నారు విజయారెడ్డి.