అధికారపార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ను దారుణంగా చంపేశారు దుండగులు. ఘటన జరిగిన తీరు చూస్తుంటే పక్కా ప్లాన్ తోనే హతమార్చినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. బాబునాయక్ తండాలోని తన ఇంటి నుంచి మహబూబాబాద్ వెళ్తున్నాడు రవి.
అయితే.. మార్గమధ్యంలో పత్తిపాక దగ్గర ఆగిన ఆయన దగ్గరకు వచ్చిన దుండగులు గొడ్డలితో నరికి పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో ఉన్న అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు రవి.
8వ వార్డుకు చెందిన రవి.. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కొన్నాళ్ల తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. అతడ్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది. ఏ ఉద్దేశంతో ఈ ఘటన జరిగిందని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
రవి హత్యతో బాబునాయక్ తండా, మహబూబాబాద్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయింది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ కావడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.