గాడిన పడిందనుకునేలోపే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ లుకలుకలు కనిపిస్తున్నాయి. కోవర్టులు వెళ్లిపోవాలంటూ కొత్త చీఫ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సైలెంటైన గులాబీ గూఢచారులు.. మళ్లీ యాక్టివ్ అయినట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో అనుమానం రాకుండా రేవంత్ రెడ్డి వెంటే తిరుగుతూ నమ్మకంగా మెలిగిన కొందరు నేతలు.. ఆయన మర్మం తెలుసుకుని ఇప్పుడు వెనుక గోతులు తీసే పనికి పూనుకున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన క్రమంలో.. కొందరు నేతలు తమ పూర్వపు నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.
దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏఐసీసీ డైరెక్షన్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. మొదటిసారి పూర్తిగా పీసీసీ నాయకత్వంలో దీనిని ప్లాన్ చేశారు. అయితే ఏఐసీసీ ఆదేశించిన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నట్టు బిల్డప్ ఇచ్చిన కొందరు నేతలు.. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ విషయంలో మాత్రం లోపాలు వెతకడం పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అలా కాదు, ఇలా కాదు అంటూ.. రేవంత్ రెడ్డి లేనప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మిగిలిన నేతలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కేడర్ చర్చించుకుంటోంది.
పీసీసీ చీఫ్ చెప్పిన పనిని చేయాల్సిందిపోయి.. తాము డిల్లీ మనుషులం అంటూ.. తమ పనివేరేనంటూ కీలకమైన సమయంలో రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాలను అమలు చేయాల్సిన ఓ ముఖ్య నేత అయితే.. ఇంతటి కీలకమైన సమయంలో విదేశాల్లో విహారయాత్రకు వెళ్లడమేకాకుండా.. అక్కడి నుంచే ప్రోగ్రామ్‌ను చెడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని పార్టీలో కొందరు చెప్పుకుంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి, ఇతర నేతల మధ్య విబేధాలు ఉన్నాయని అక్కడి నుంచే మిస్‌గైడ్ ఇస్తూ.. మీడియాలో కథనాలు వచ్చేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ డైరెక్షన్‌లోనే ఆయా నేతలు అవుటాఫ్ కంట్రీస్ నుంచి ఇదంతా నడిపిస్తున్నారని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎలాగైనా దండోరా సభను విజయవంతం చేసి.. వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని, ఆపై వారి సంగతి చూడాలని అనుకుంటున్నట్టుగా సమాచారం.