గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు ఊరుకులు, పరుగుల తీస్తోంటే టీఆర్ఎస్ మాత్రం ఇంకా మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు విపక్షాల నుంచి నేతలు పోటాపోటీ పడుతుంటే.. గులాబీ నేతలు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా సీరియస్‌గా నిర్వహించిన టీఆర్ఎస్.. అభ్యర్థి ఎంపికలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది.
బీజేపీ తరపున పోటీకి రామచందర్ రావు మరోసారి తన అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసుకున్నారు. ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని జిల్లాలు, మండలాల్లో పార్టీ నాయకులు, పట్టభద్రులతో సమావేశమవుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. అభ్యర్థి ఎవరో తేలకపోయినా టికెట్ కోసం పోటీ మాత్రం భారీగానే ఉంది. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్.. ఈ మూడు జిల్లాల నుంచి నేతలు పోటీపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు బరిలో నిలించేందుకు ఉవ్విళ్లురుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిద మధ్యనే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇతరుల విషయానికి వస్తే మూడోసారి ఎమ్మెల్సీ కావడం కోసం..ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రంగంలోకి దిగారు. అయితే ఆయనకు వామపక్షాలు తమ మద్దతును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇండిపెండెంట్లుగా సామాజిక వేత్త సామాల వేణు, మరికొందరు కూడా పోటికి సై అంటున్నారు. ఇలా అన్ని పార్టీలు, స్వతంత్రులు కూడా సీరియస్‌గా కసరత్తులు చేస్తోంటే అధికార పార్టీలో ఎలాంటి హడావుడి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ స్థానంలో అభ్యర్థులను నిలబెట్టినా టీఆర్ఎస్ ఎప్పుడూ గెలవలేదు. ఈ సారైనా ఎలాగైనా గెలవాలని భావిస్తోంటే.. పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నదానిపైనే ఉత్కంఠ నెలకొంది.