గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైనా.. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎవరనేది టీఆర్ఎస్ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. అసలు పోటీ చేస్తుందా లేదా అన్నది కూడా అంతుబట్టడం లేదు. వరంగల్- ఖమ్మం- నల్లగొండ స్థానం విషయంలో అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించింది అధికార పార్టీ. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. కానీ హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ విషయంలోనే ఆ పార్టీ వ్యూహం ఏమిటో అంతుబట్టడం లేదు. పైగా ఈ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా పెద్దగా ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు కూడా ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోయారు. దీంతో అచ్చిరాని చోట పోటీచేసి ఓటమి పాలవ్వడం అవసరమా అన్న అభిప్రాయాలు కూడా ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. దీనికి తోడు పట్టభద్రుల్లో అధికార పార్టీపై పీకల్లోతు కోపముంది. దీంతో నేరుగా పోటీ చేయడం కంటే.. వామపక్షాల తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌కు మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తోందన్న ప్రచారమూ జరుగుతోంది.
ఇవన్నీ పక్కనపెడితే పోటీ చేస్తే ఓడిపోతామన్న భయం.. ఇతరులకు మద్దతిస్తే తప్పించుకుందన్న అపవాదు వెంటాడే అవకాశం ఉండటంతో.. ఏం చేయాలో తెలియక అధిష్టానం తలపట్టుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.